వీరశిల/వీరగల్లు మరియు సతిశిల( Hero stone and Sati stone)

నేను శివరాత్రికి నల్లమల లో ఉన్న బౌరాపూర్ శివాలయాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మారడుగు గ్రామ సమీపంలో లో ఉన్న మార్కండేయ స్వామి గుడిని సందర్శించడం జరిగింది. ఈ గుడి ముందు ఉన్న ఒక శిల్పం నన్ను బాగా ఆకర్షించింది. అది ఒక వీరగల్లు మరియు సతిశిల. రెండు ఒకే రాతి ఫలకం పై చెక్కబడి ఉన్నవి.

hs1

HERO AND SATI STONE IN MARADUGU VILLAGE

యుద్ధ వీరులు మరణించినప్పుడు వారి పేరు మీద వేయించి రాతి చిహ్నమే వీరగల్లు. గ్రామ రక్షణ కోసం గాని, క్రూర మృగాల బారినుండి ప్రజలను కాపాడే ప్రయత్నంలో గాని, పశువుల మందను కాపాడుకోవడం కోసం గాని, యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందినప్పుడు వీరి జ్ఞాపకంగా సంబంధిత రాజులు, గ్రామ మోతుబరులు, పెద్దలు “వీరగల్లులు“(Hero Stone) వేయించేవారు. కొన్ని సందర్భాల్లో తన భర్త వీరమరణం పొందిన తర్వాత భార్య కూడా సహగమనానికి సిద్ధం అయ్యేది. ఇలా సహగమనం అయిన తర్వాత వారికి గుర్తుగా పెట్టే రాతి శిల్పాలను “సతిశిలలు“(Sati Stone) అంటారు. 


తర్వాత కాలంలో ఈ శిలలను గ్రామ దేవతలుగా, పేరంటాళ్లుగా, పోతురాజులుగా, తమను కాపాడే శక్తులుగా పూజిస్తూ ఏడాదికి ఒకసారి జాతరలు చేయటం, బలులు ఇవ్వడం జరుగుతూ ఉంది జరుగుతుంది.
అయితే వీరశైవ మతం ఉచ్చదశలో ఉన్న కాలంలో వీరశైవులు శివసాయిజ్యం కోసం ఆత్మాహుతి చేసుకున్నప్పుడు వేసిన శిలలు కూడా ఈ వీరగల్లు లలో కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో వీరశైవాన్ని ఎక్కువగా ఆదరించిన వారు కొండవీటి రెడ్డి రాజులు. శివుని భయంకర రూపాలైన భైరవ, మైలార, వీరముష్టి, జంగమ మఠాలు ప్రతిష్టించి పూజించేవారు. తాంత్రిక విధానంలో దేవతలకు ‘పంచమ’కారాలనే నైవేద్యం సమర్పించేవారు. మద్యం, మీనం, మాంసం, ముద్ర, మైధునం వీటిని పంచమకారాలు అంటారు.మైలారభటులు,వీరముష్టి వారు, వీర జంగములు పాశుపత ఆరాధనలో అనేక సాహసకృత్యాలు చేసేవారు. రాజు కోసం రాజ్యం కోసం వారు తలలు నరుక్కునేవారు, పొట్టలో కత్తులు జొప్పించుకునేవారు. స్త్రీ పురుషులు ఆత్మహత్యలు చేసుకునే గుడులు ఉండేవి. వీటినే ‘చంపడు గుడులు‘ అనేవారు. వీటి గురించి ప్రస్తావన కొరవి గోపరాజు రాసిన “సింహాసన ద్వాత్రింశిక” అనే గ్రంథంలో ఉంది. కొండవీటి రెడ్డి రాజు అనవేమారెడ్డి శ్రీశైలం లో నిర్మించిన ‘వీరశిరోమండపం‘ కూడా ఇలాంటిదే. దీనిలో భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత తమ శరీర భాగాలను, తలను గండ కత్తెర వేసుకొని దేవుడికి అర్పించే వారు.

hs

HERO STONE IN HAMPI


పాల్కురికి సోమనాథుడు రాసిన “పండితారాధ్య చరిత్ర” ను బట్టి శ్రీశైలంలో ‘భృగుపాతం‘ ఆచారం కూడా ఉంది. అంటే భక్తులు శివైక్యం పొందటానికి కొండచరియలు పైనుండి దూకి ఆత్మాహుతి చేసుకోవడం. ప్రస్తుతం శ్రీశైలంలోని ‘సిద్ధ రామప్ప కొలను‘ ప్రాంతంలో పూర్వం భృగుపాతం జరిగేది.


కాకతీయుల కాలంలో యుద్ధంలో ఓడిన శత్రువుల తలలతో బంతులు ఆటలు ఆడటం (శిరఃకందుక క్రీడావినోదం) చేసేవారు. కాకతీయ గణపతి దేవుని సేనలు వెలనాటి రాజైన పృధ్వీశ్వరుడిని పై దండెత్తి అతన్ని యుద్ధంలో ఓడించి చంపాయి. కొన్ని కాకతీయ శాసనాలలో గణపతిదేవునికి “పృథ్వీశ్వర శిరఃఖండుక క్రీడావినోద” అనే బిరుదు ఉంది.
రేచర్ల వెలమ రాజుల కాలంలో ‘రణముకుడుపు‘ అనే భైరవ తాంత్రిక విధానం ఉండేది. యుద్ధంలో చనిపోయిన శత్రువుల యొక్క రక్తమాంసాలతో ఉడికించిన అన్నం కావలి దేవతలకు ఊరి చుట్టూ పొలిజల్లడం చేసేవారు. ఇటువంటి సంస్కృతి మనకు వీరగల్లు లలొ, మధ్యయుగ సాహిత్యంలో కనిపిస్తుంది.

                                                                                     —-నల్లగొర్ల వేదాద్రి.